ప్రకృతి అంతుచిక్కని ఓ విస్మయం! ఉష్ణోగ్రతల్లో 1-2 డిగ్రీల సెల్సియస్‌ మేర వైరుధ్యమంటే మనం పెద్ద తేడాగా భావించకపోవచ్చు!! ప్రకృతికి సంబంధించి మాత్రం అది పెను విధ్వంసమే!!! నివురుగప్పిన నిప్పులా పసిఫిక్‌ మహాసముద్రంలో రాజుకుంటున్న ఎల్‌నినోను పరిశీలిస్తే మనకు ఇదే బోధపడుతుంది. సరాసరి ఉష్ణోగ్రతల కన్నా కొద్ది వైరుధ్యానికే పుడమిపై పెను విధ్వంసాన్ని మిగిలిస్తోంది.*

*🛟ఎల్‌నినోకు సంబంధించి వాతావరణ శాస్త్రవేత్తల ఆందోళనలే నిజమవుతున్నాయి. ఈ ఏడాది సూపర్‌ ఎల్‌నినో ఏర్పడటమే కాదు.. అది గతంలో ఊహించినదాని కన్నా బలంగా ఉండొచ్చని ప్రబల సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ విధ్వంసకర పోకడకు కారణమవుతున్న పసిఫిక్‌ మహాసముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రతల్లో పెరుగుదల.. మొదట అంచనావేసిన దానికన్నా ఎక్కువగా ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. సగటు కన్నా 2.5 డిగ్రీల సెల్సియస్‌ మేర అధికంగా ఉండొచ్చని మొదట భావించగా ఇప్పుడు అది 3 డిగ్రీలను కూడా మించిపోవచ్చని కొన్ని అంచనాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో వాతావరణానికి సంబంధించి సంప్రదాయ తీరుతెన్నులన్నీ పూర్తిగా తారుమారు కావొచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 150 ఏళ్ల కిందట మహా కరవుకు బీజం వేసిన సూపర్‌ ఎల్‌నినో కన్నా శక్తిమంతమైన వాతావరణ పోకడ ఈ దఫా ఉండొచ్చన్న అంచనాలూ ఉన్నాయి. రుతుపవనాలు, వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడే భారత్‌ వంటి దేశాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంటున్నారు. ఇప్పటికే ఎల్‌నినో కారణంగా ఉష్ణోగ్రతలు పెరగడం, రుతుపవనాల రాకలో జాప్యం వంటివి తలెత్తాయి. పశ్చిమాసియా సంక్షోభంతో ఇప్పటికే ఇంధన, ఎరువుల సంక్షోభంతో ఎదురవుతున్న ఇబ్బందులకు ఇది ఆజ్యం పోయవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.*

*💥ఏమిటీ పోకడ.. ప్రస్తుతం ఏమవుతోంది?*

*➡️ఎల్‌నినో అనేది సహజసిద్ధ వాతావరణ చక్రం! ఉష్ణమండల పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితల జలాలు తీవ్రస్థాయిలో వేడెక్కడం వల్ల ఇది ఉత్పన్నమవుతుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా గాలుల పోకడ అసాధారణరీతిలో మారిపోతుంది.*

*➡️ప్రస్తుతం పసిఫిక్‌లోని నిర్దిష్ట ప్రాంతంలో ఉపరితల జలాల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫలితంగా ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జూన్‌-ఆగస్టు మధ్యలో ఇది రూపుదిద్దుకోవడానికి 80 శాతం, నవంబరులోగా ఏర్పడటానికి 90 శాతం ఆస్కారం ఉందని అంతర్జాతీయ అంచనాలు చెబుతున్నాయి.*

*➡️పసిఫిక్‌ జలాలు తీవ్రంగా వేడెక్కడం వల్ల ఆ మహాసాగరానికి ఎగువన ఉన్న గాలి ఉష్ణోగ్రత సాధారణం కన్నా 2-3 డిగ్రీల సెల్సియస్‌ మేర ఎక్కువగా వేడెక్కవచ్చు. ఆ వేడిగాలి.. వాతావరణంలో పైకి లేచి, దిగువన శూన్యాన్ని ఏర్పరుస్తుంది. దీంతో అధిక పీడనంతో కూడిన శీతల ప్రాంతం కాస్తా.. వేడిగాలితో కూడిన అల్పపీడన ప్రాంతంగా మారుతుంది.*

*➡️అల్పపీడన ప్రాంతంగా మారిన శూన్యంలోకి ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న చల్లటిగాలి చొచ్చుకొస్తుంది.*

*➡️ఇది ప్రమాదకరం. ఎందుకంటే ఆసియా, ఆస్ట్రేలియా వైపు ప్రయాణించే పసిఫిక్‌ శీతల గాలులు తమ వెంట నీటి ఆవిరి, రుతుపవనాలను తీసుకొచ్చి.. వేసవితో వేడెక్కిన భూభాగాలను చల్లబరచి, ఉపశమనం కల్పించాల్సి ఉంటుంది.*

*➡️ఇప్పుడు పసిఫిక్‌ ఉపరితల జలాల మితిమీరిన వేడి కారణంగా గాలి కదలికలు తారుమారవుతాయి. రుతుపవనాలు, శీతల తేమతో కూడిన గాలుల్లో చాలా భాగం.. ఉత్తర, దక్షిణ అమెరికాలోని పశ్చిమ తీర ప్రాంతాల వైపు మళ్లుతాయి.*

*➡️2-7 ఏళ్లకోసారి ఎల్‌నినోలు ఏర్పడతాయి.*

*💥అన్నిసార్లూ ఎల్‌నినోదే విజయం కాదు..*

*💫1951 నుంచి 2022 మధ్య.. ఎల్‌నినో ఏర్పడ్డ సంవత్సరాల్లో దాదాపు 60 శాతం మేర భారత్‌లో సరాసరి కన్నా తక్కువ వర్షపాతమే కురిసింది. అయితే కొన్నిసార్లు ఇవి వర్షాలపై ప్రభావం చూపలేదు. గత కొన్ని దశాబ్దాల్లో తలెత్తిన 17 ప్రధాన ఎల్‌నినో ఘటనల్లో కనీసం ఐదుసార్లు సాధారణ లేదా అధిక వర్షాలు కురిశాయి. 1997-98లో శక్తిమంతమైన ఎల్‌నినో ఆందోళన కలిగించింది. అయితే నాడు సానుకూల ఇండియన్‌ ఓషన్‌ డైపోల్‌ (ఐవోడీ).. భారత్‌కు అధిక వర్షాలను ఇచ్చింది. 1983, 1994, 2006లోనూ ఇలాంటి పరిణామాలే జరిగాయి. 2006లో బలహీన ఎల్‌నినోతో పెద్దగా ఇబ్బంది ఏర్పడలేదు. ఈసారి కూడా ఐవోడీ కరుణించొచ్చని, ఎల్‌నినో ప్రభావాన్ని కొంతమేర తగ్గించొచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.*

*💥ఏమిటీ ఐవోడీ*

*✴️పశ్చిమ, తూర్పు హిందు మహాసముద్ర ప్రాంతాల్లో నెలకొనే ఉష్ణోగ్రత వైరుధ్యాలను ఐవోడీగా పేర్కొంటారు. ఇది ప్రస్తుతం తటస్థ స్థితిలో ఉంది. ఈ వర్షాకాలం చివర్లో అది సానుకూల స్థితికి మారొచ్చని అంచనా. ఇది సానుకూల స్థితిలో ఉంటే ఇండోనేసియా వద్ద ఉన్న జలాలు సాధారణం కన్నా చల్లగా, పశ్చిమ హిందూ మహాసముద్రం వద్ద వేడిగా ఉంటాయి. ఫలితంగా భారత్‌కు తేమ ఎక్కువగా వస్తుంది. దీనివల్ల వర్షాలు కొంత పెరుగుతాయి.*

*💥వర్గీకరణ ఇలా..*

 *➡️భూమధ్యరేఖ ప్రాంతంలోని పసిఫిక్‌ మహాసముద్రంలో నిర్దిష్ట ప్రదేశంలో ఉపరితల జలాలు సాధారణం కన్నా ఎంత ఎక్కువగా వేడెక్కుతున్నాయన్నదాని ఆధారంగా ఎల్‌నినో బలాన్ని కొలుస్తారు.*

*➡️సరాసరి ఉష్ణోగ్రతలతో పోల్చినప్పుడు పసిఫిక్‌ జలాలు ఎక్కువకాలంపాటు 0.5 డిగ్రీల సెల్సియస్‌ను మించి వేడెక్కితే బలహీన ఎల్‌నినో ఏర్పడుతుంది.*

*➡️అది 2 డిగ్రీల సెల్సియస్‌ను మించితే బలమైన లేదా సూపర్‌ ఎల్‌నినో పుట్టుకొస్తుంది.*

*💥శీతాకాలం నాటికి విశ్వరూపం*

*✳️ఈసారి ఎల్‌నినో ఏర్పడటానికి 98 శాతం అవకాశం ఉందని, అది అత్యంత బలమైందిగా మారడానికి 80 శాతం అవకాశం ఉందని అమెరికాకు చెందిన నేషనల్‌ ఓషనోగ్రఫిక్‌ అండ్‌ అట్మాస్పియరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నోవా) నిపుణులు తెలిపారు. నవంబరు నుంచి జనవరి మధ్యలో అది సూపర్‌ ఎల్‌నినోగా రూపాంతరం చెందడానికి అవకాశం పెరుగుతోంది. వాతావరణ రికార్డుల నమోదు మొదలైనప్పటి నుంచి అత్యంత బలమైన ఎల్‌నినో ఇదే కావొచ్చని కొన్ని కంప్యూటర్‌ నమూనాలు చెబుతున్నాయి.*

*💥భారత్‌పై పెను ప్రభావం*

*➡️ఎల్‌నినో పర్యవసానాలు పుడమి అంతటా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో కరవు, అసాధారణ ఉష్ణోగ్రతలు చోటుచేసుకుంటాయి. దీనివల్ల కార్చిచ్చు, నీటి లభ్యత తగ్గిపోవడం వంటివి తలెత్తవచ్చు. మరికొన్ని ప్రాంతాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతాయి.*

 *➡️ఎల్‌నినోను రుతుపవనాల వినాశకారిగా పేర్కొంటారు. భారత్‌లో దాదాపు 70 శాతం వార్షిక వర్షపాతం సీజనల్‌ రుతుపవనాల ద్వారానే వస్తుంది. దేశంలో పంటలకు చాలావరకూ ఇదే ఆసరా. అందువల్ల వర్షపాతం తగ్గితే భారత్‌లో అనేక రంగాలపై ప్రభావం పడుతుంది. ఈసారి దాదాపు 10 శాతం మేర వర్షాలు తక్కువగా పడొచ్చని భారత వాతావరణ విభాగం కూడా అంచనావేస్తోంది.*

*➡️ఎల్‌నినో వల్ల భూతాపం, వాతావరణ మార్పులు తీవ్రమవుతాయి. బలమైన ఎల్‌నినోలతో ఈ ప్రభావాలు మరింత తీవ్రమవుతాయి.*

*💥మహాకరవుకు బీజం వేసిన సూపర్‌ ఎల్‌నినో*

*♦️సూపర్‌ ఎల్‌నినో కారణంగా తలెత్తిన పరిణామాలతో 1876-78లో భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తీవ్ర కరవు రాజ్యమేలింది. వర్షాల్లేక నదులు, రిజర్వాయర్లు ఎండిపోయాయి. ఆహారోత్పత్తి దెబ్బతిని ఆకలి కేకలు మిన్నంటాయి. భారత్, ఆగ్నేయాసియా, దక్షిణ అమెరికాలోని ఉత్తర భాగం, దక్షిణ, తూర్పు ఆఫ్రికాలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. నాడు ప్రపంచవ్యాప్తంగా క్షుద్బాధతో 3-5 కోట్ల మంది బలయ్యారు. భారత్‌లో మద్రాస్, మైసూర్, హైదరాబాద్, బాంబే ప్రాంతాల్లో దాని తీవ్రత ఎక్కువగా కనిపించింది. ఆ కరవు రక్కసి కోరల్లో చిక్కి దేశంలో 56 లక్షల నుంచి 96 లక్షల మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా.*

*◾నాటితో పోలిస్తే వర్షపాత లోటును తట్టుకోవడంలో భారత్‌ చాలా పురోగతి సాధించింది. సాగు విస్తీర్ణం, వ్యవసాయ విధానాలు మెరుగుపడ్డాయి. వాతావరణ హెచ్చరికల్లో కచ్చితత్వం పెరిగింది. ఆహార ధాన్యాల నిల్వలు భారీగానే ఉన్నాయి. అయినా సూపర్‌ ఎల్‌నినోకు తగ్గట్టుగా అప్రమత్తత, పకడ్బందీ ప్రణాళికలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఎల్‌నినోను నివారించలేం. కొన్ని ముందస్తు చర్యలతో దాని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *