హైదరాబాద్ పాతబస్తీ ప్రజల కల అయిన మెట్రోరైలు ప్రాజెక్టు పనులు పక్కా ప్రణాళికతో వేగంగా ముందుకు సాగుతున్నాయి. మెట్రోరైలు రెండో దశ నిర్మాణంలో భాగంగా అత్యంత కీలకమైన భూసేకరణ ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకుందని హైదరాబాద్ మెట్రోరైలు ఉన్నతాధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ రూట్‌లో సేకరించాల్సిన మొత్తం 888 ఆస్తులకు గాను, ఇప్పటికే 825 ఆస్తుల సేకరణ విజయవంతంగా పూర్తయింది. ఇది మొత్తం భూసేకరణలో దాదాపు 93 శాతమని అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న వ్యక్తిగత ఆస్తులకు సంబంధించి బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు రూ.820 కోట్ల పరిహారాన్ని పంపిణీ చేసింది. పరిహారం అందుకున్న ప్రాంతాల్లో ఆస్తులను స్వాధీనం చేసుకుని కూల్చివేతల ప్రక్రియను సైతం అధికారులు ఇప్పటికే ప్రారంభించారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మొత్తం 7.5 కిలోమీటర్ల మేర సాగే ఈ సెకండ్ ఫేజ్ మెట్రో లైన్.. దారుల్‌షిఫా, పురానీహవేలీ, అలీజా కోట్ల, హరిబౌలి, షాలిబండ, షంషీర్‌గంజ్, ఫలక్‌నుమా మీదుగా చాంద్రాయణగుట్టకు చేరుకుంటుంది. ఈ చారిత్రాత్మక మార్గంలో దాదాపు 105 మతపరమైన, సాంస్కృతిక, చారిత్రక కట్టడాలు ఉన్నాయి. పాతబస్తీ సంస్కృతికి చిహ్నాలుగా నిలిచే ఈ కట్టడాలకు ఎలాంటి హాని కూడా కలగకుండా అత్యంత జాగ్రత్తగా ఆస్తుల సేకరణ, పనుల డిజైన్లను రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, మిగిలిన 7 శాతం ఆస్తుల్లో మూడు పురాతన కట్టడాల పరిస్థితి ప్రస్తుతం వారసత్వ కట్టడాల సంరక్షణ కమిటీ పరిశీలనలో ఉంది.భూసేకరణలో మిగిలిన కొన్ని ఆస్తులు ప్రస్తుతం చట్టపరమైన చిక్కుల్లో ఉన్నాయి. ఇందులో 10 ఆస్తులకు సంబంధించిన కేసులు కోర్టులలో నడుస్తుండగా.. మరికొన్ని ఆస్తుల వివాదాలు ప్రధాన భూ పరిపాలన కమిషనర్ పరిధిలోని భూసేకరణ, పునరావాసం, రీసెటిల్‌మెంట్ అథారిటీ పరిధిలో పరిష్కారం కోసం వేచి ఉన్నాయి. ముఖ్యంగా మెట్రోరైలు సంస్థ సేకరిస్తున్న భూములలో కొన్ని వక్ఫ్ ఆస్తులు ఉండటం వివాదానికి దారితీసింది. ఆయా భూములు వక్ఫ్ ఆస్తులని తెలియకుండానే తాము గతంలో కొనుగోలు చేశామని ప్రస్తుత యజమానులు చెబుతున్నారు. మెట్రో అధికారులు వీటికి నోటీసులు జారీ చేయడంతో బాధితులు ఎల్‌ఏఆర్‌ఆర్‌ఏను ఆశ్రయించారు. ఈ వివాదాలు మినహా మిగతా వ్యక్తిగత ఆస్తుల సేకరణ అంతా సజావుగా సాగిపోయింది. భూసేకరణ ప్రక్రియ చివరి దశలో కొనసాగుతుండగానే.. మరోవైపు పాతబస్తీ మెట్రో ప్రాజెక్టు క్షేత్రస్థాయి పనులను పర్యవేక్షించేందుకు, సాంకేతిక సలహాలు అందించేందుకు జనరల్ కన్సల్టెన్సీ నియామకానికి మెట్రో సంస్థ టెండర్లను ఆహ్వానించింది. దీంతో త్వరలోనే పనులు పూర్తిస్థాయిలో పట్టాలెక్కనున్నాయి. రానున్న రోజుల్లో అలియాబాద్ వంటి కీలకమైన, ఇరుకైన ప్రాంతాలలో ఆస్తుల కూల్చివేతలు చేపట్టి, యుద్ధప్రతిపాదికన రహదారి విస్తరణ పనులను పూర్తి చేస్తామని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ మెట్రో లైన్ అందుబాటులోకి వస్తే పాతబస్తీ రవాణా ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. Post navigation నిమ్స్ డైరెక్టర్గా డాక్టర్ రాహుల్ దేవరాజ్ Cheryal Tahsildar Arrested by ACB :ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దారు